Monday, April 9, 2007

సుందర కాండ 14వ సర్గ

అమిత వేగుడగు వాయు నందనుడు
ఒక పరి దీర్ఘముగ ఆలోచించి
ఒక్క ఉదుటన గోడను ప్రాకి
అశోకవనమును తేరి చూసెను 1

అశోక సాలాది వృక్ష సమూహములు
పూలతో నిండిన చంపకములు
పండ్లతొ ఊగెడి ఉద్దాలకములు
కోతిమూతి రంగుగల మామిడి పళ్ళను 2

వసంత కళళతొ శోభిల్లు వనమును
రంగు రంగులుగ మెరిసెడి చెట్లను
ప్రహరీ గోడపై నిలిచిన మారుతి
అచ్చెరువందుచు చూచుచు నిల్చెను 3

బాణమునుండి ఎగిరిన
నరచ మను అంబు వలె
లతలతో మామిడి చెట్లతొ నిండిన
వనము లోనికి మారుతి ఎగిరెను 4

కోతగు మారుతి వనమున
దూకిన తోడనె అటునిటు చూసెను
కేరింతలు కొట్టే కొందరు మనుషులు
వింత కాంతిగల పశుపక్ష్యాదులు 5

వసంత ఋతువును ప్రతిబింబిస్తు
ప్రతిధ్వనించె పక్షుల కిలకిల
బంగరు తొడుగుల మెరిసెడి చెట్లు
కొమ్మల నిండుగ నిల్చిన పిట్టలు 6

ప్రభాత కాంతితో వెలిగెడి చెట్లు
పండల భారమున ఊగెడి చెట్లు
పువ్వులు నిండిన పరిమళ లతలు
తుమ్మెద రెక్కల ఝుమ్మను సబ్దము 7

కోకిల కూతల మధుర గానము
నెమలి అరుపులతొ మ్రోగెడి దిక్కులు
వేడికి తాళక నీటిని చేరిన
రక రకాలగు పశు పక్ష్యాదులు 8

అశోకవనమున పెరిగిన శక్తితొ
కొమ్మ కొమ్మ పై ఎగురుతు దూకుతు
నిద్రలొ వున్న పక్షుల లేపుతు
మారుతి మొదలిడె సీతను వెదకను 9

మారుతి చేసిన గొడవకి ఎగిరిన
పక్షుల రెక్కల వేగపు దెబ్బకి
కొమ్మల కున్న విరిసిన పూలు
వాన జల్లు వలె నేల కొరిగెను 10

తనపై పడ్డ రంగుల పూలతొ
వింత రంగుల పుప్పొడి పూతతొ
అశోకవనపు ముంగిలి లోన
పూల గుట్టవలె మారుతి వెలిగె 11

పుప్పొడి పూతతో రంగులు అమరి
అతివేగముగా అటునిటు తిరుగుతు
అశోక శోభను పెంచిన మారుతి
వన్సంతుడతనని అనిపించుచుండె 12

కొమ్మల నుండి రాలిన పూలతొ
వివిధ రంగులు గల మెరుపు రేఖలతొ
నిండిన అశోక వన ప్రాంతము
భూషణములమరిన యువతివలె నుండె 13


కొమ్మల పైన బలముగ ఎగురుతు
ముందుకు సాగెడి మారుతి గతికి
రేగిన గాలికి రాలిన పువ్వులు
నేలను చేరి అద్భుత దృస్యముగయ్యె 14



విరిగిన కొమ్మలు రాలిన ఆకులు
జారిన పువ్వులు ఊడిన పండ్లతో
జూదము ఆడి వలువలు ఓడిన
జూదరి మాదిరి ఆవనముండే 15

తీయటి ఫలములు రంగుల పూలతొ
అలరారే ఆ వృక్ష సంపద
క్షణమున హనుమ తాకిడికి
నేలన కూలి వెల వెల బోయెను 16

చెదిరిన గూళ్ళతొ బెదిరిన పక్షులు
మిగిలిన కొమ్మల పైనకు ఎగిరి
జారిన గుండెతొ విరిగిన ఇళ్ళను
చూచుచు వగచెను అచ్చెరువొంది 17

గాలికి రేగిన కేశములతోటి
చెదిరిన గంధపు లేపన తోటి
ఊడిన పండ్లుయు గోళ్ళను గల్గిన
కురూపిగ మర్రిన సుందరి వలె 19

హనుమ పాదముల వేగము దెబ్బకి
చేతులు పట్టుకునూపిన ఊపుకి
నేలకొరిగిన మహా వృక్షములతొ
అశోకవనము ఇప్పుడు నగుపడె 18

వింధ్య పర్వత శిఖరపుటంచుల
సుడులు రేగిన గాలి బలిమికి
చెదిరిపోయెడి మబ్బు తునకల వలె
హనుమ గతికి తెగెను లతలు ఎన్నొ 20

మణులు పొదిగిన సన్న దారులు
సువర్ణము తాపిన కాలి బాటలు
వెండి మెట్లతొ వెలుగు పథములు
హనుమ చూచుచు అచట నిల్చెను 21

వివిధ ఆకృతులలొ బాగ అమరి
మంచి నీటితొ నిండి వున్నవై
మణులు పొదిగిన మెట్లు గలిగి
ఈదులాడుటకు సులువులు గలవై 22

ముత్యము పగడము ఇసుకగ వాడి
స్పటికపు ఇటుకలు గోడలు కాగా
వికశించిన పద్మపు మొక్కలు గల్గి
చంద్ర కాంతిలో ధగ ధగ మెరిసెడి 23

కలువ కొలనులను అచ్చెరువందుచు
గుబురు పొదలలొ పక్షులు కూయగ
విరిసిన కన్నుల ఆనందముతో చూచుచునక్కడె
శిలలా నిల్చెను వీర మారుతి 24

చకోర చక్రవాక హంస కొంగల
మధుర కిల కిలారావాలచట నిండెను
జలపాతాల హోరు, సెలయేళ్ళ గల గల
వికసించిన పూల పరిమళ గాలులు 25

వివిధ రంగుల గుబురు పొదలు
కాంతులు వెదజల్లెడి పూల తీగెలు
కరవీర చెట్ల తొర్రలతో
అశోక వనము అలరారు తుండె 26


ఇంతలొ హనుమ ముందుకు సాగి
ఎత్తగు శిఖరాలు మెందుగగల్గి
అతి పెద్ద వృక్షములతో నిండి
నాల్గు దిశలకు విస్తరించినదై 27

ఈ భూతలమందున సుందర మైనదై
మేఘపుటంచులు తాకు చున్నదై
ఆ వనపు శోభను పెంచుచున్నదై
అతి ఉత్తమ కొండను హనుమ చూసెను 28

ప్రియుని ఒడిలోనికి దూకెడి స్త్రీవలె
ఒరవడి గల్గిన జలపాతమొకటిని
ఆ కొండ సిఖరములపై హనుమ చూసెను
తాపము తాళక నీట దూకెడి 29

యువతిని పట్టిన బంధువర్గము వలె
ఆ నీటి అంచులను తాకెడి కొమ్మను
గాలి తాకిదికి చెట్లు వెనకకు లాగెను
విరహము తాళక ప్రియుని సన్నిధికి 30

పరుగిడు యువతి వలె వేగము గల్గి
గల గల పారుతు ముందుకు దుమికెడి
కన్నుల పండుగగు చల్లని సెలయేటిని
అచ్చెరువంది అక్కడె నిల్చి మారుతి చూసెను 31

ఆ కొండకు ప్రక్కగా పక్షి గుంపులతొ
కలువలు నిండిన కొలనొకదానిని
అతి పరాక్రముడు వాయు నందనుదు
ప్రశాంత చిత్తుడై చూచి నిల్చెను 32

కృత్రిమముగా నిర్మించ బడినది
చల్లని నీటితొ నింది యున్నది
వజ్రపు పొదుగుల మెట్లను గలిగి
ముత్యపు కుప్పలు అడుగున పొందిన 33

కొలను గల్గి అద్భుతముగా అలరారెడి
కృత్రిమమగు వృక్ష సముదాయములున్న
విస్వ కర్మచే నిర్మితమైన సుందరమగు
భవనమొకదానిని ఆశ్చర్యముతో హనుమ చూసెను 34

మధుర ఫలములుతొ వికశించిన పువ్వులతొ
గుబురు పొదలతొ లతలు తీగెలతొ
బంగరు తొడుగుల దిమ్మెలతో
ఆ వనము అతి సుందరముగా వెలుగు చుండె 35

సువర్ణ చాయల వెలుగుతు
రంగుల లతల తీగెలతో చుట్టబడి
బంగారు తిన్నెలతో ఆవృతమైన
ఒక శింశుపా వృక్షమును హనుమ చూసెను 3637

పచ్చిక బయళ్ళు విరబూసిన కొమ్మలు
జలజల పారెడి సెలయేళ్ళు
దీపపు కాంతులలో వెలిగెడి
వివిధ రాకముల చెట్లను హనుమ చూసెను 38

సూర్య కాంతిలో స్వర్న కాంతులీనెడి
మేరు పర్వత సిఖర సమూహము వలె
ఈ రంగురంగుల చెట్ల మాటున తనకు
స్వర్ణకాంతులు అబ్బినవని హనుమ తలచె 39

మంద్రముగా వీచెడి గాలి దెబ్బకి
నింగికెగసిన పుప్పొడిని చూసి,
వందలాది గంటల గణగణలు విని
అచటనే అబ్బురపడి నిలిచె హనుమ 40

మంచి పూలతో లేత చిగురులతొ
లేత కొమ్మలు చిన్న రెమ్మలతో
శోభిల్లుతున్న శింశుపమెక్కుతూ
హనుమ మనమున ఇట్లు తలచెను 41

"శ్రీ రాముడు తనకై వచ్చునని
ఆశ మదిలో నింపుకున్న దై
అటునిటు తిరిగెడి మాత ఇచటకు
వచ్చినప్పుదు నేను చూడగలను 42

చంపక వకుళ గంధపు చెట్లతొ
అతిసుందరముగా అలరారెడి ఈ వనము
అసురుడు రావణుడి ఆస్తి ఐనను
అద్భుత కాంతుల వెలుగు చున్నది 43

పక్షి గుంపుల కిలకిల రవళులు
అద్భుత కళగల పద్మము కలువలు
శోభను పెంచెడి జలచర రాసుల
వెలిగెడీ కొలనుకు సీత తప్పక వచ్చును 44

శ్రీ రాముని ప్రియసఖి
రామ మనోల్లసిని, అతి పతివ్రత
వనవిహారమున నేర్పరి ఆమే
ఇచటకు తప్పక వచ్చి తీరును 45

జింక కన్నులతొ వెలిగెడి మాత
రాముని తలపుల వేదన పెరిగి
గుండె భారమును తగ్గించుటకు
తప్పక ఇచటకు వచ్చి తీరును 46

రాముని విరహము తాళని సీత
అలసిన హృదయపు సేద తీర్చుటకు
వన విహారము చేయ తలచినదై
తప్పక ఇచటకు వచ్చి తీరును 47

రాముని చూడక వేదన పెరిగి
రాక్షస బాధలకోరిమి తరిగి
జనక నందిని, శ్రీరామ ప్రియ సఖి
వనమును చూచుటకు ఇచటకు వచ్చును 48

బంగరు వన్నెతొ వెలిగెడి సీత
సంధ్యా సమయపు తర్పణ నివ్వగ
చక్కటి నదులతో వెలిగెడీ వనముకు
సాయం సమయము తప్పక వచ్చును 49

శ్రీ రాముని ప్రేయసి, అతి పతివ్రత
అయోధ్యకు రాణి, జనకుని పుత్రిక
అట్టి పవిత్ర మూర్తికీ అశోక వనము
తప్పని సరిగా శుభముల నిచ్చును 50

ఇందువదనగు ఆ సీతా మాత
బ్రతికి వుండిన తప్పని సరిగా
పవిత్ర జలముల సేద తీరుటకు
ఈ అశోకవనమునకు వచ్చి తీరును" 51

ఈ విధముగా మనమున అనుచూ
వివిధ పూలతో గుబురుగ పెరిగిన
ఆ శింశుపా వృక్షపు కొమ్మల నదుమ
అటునిటు చూచుచు మాత రాకకై వేచివుండెను 52

No comments: